జీవిత చరిత్ర

ప్రొఫైల్

మార్చి 18, 1953న రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీ సాయన్న గౌడ్, శ్రీమతి సత్తెమ్మ దంపతులకు జన్మించిన టి. దేవేందర్ గౌడ్ ధర్మవంత్ కాలేజీ ప్రెసిడెంట్గా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ‘బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్’ నుంచి పట్టా పుచ్చుకున్నారు. సామాజిక సమస్యలపై లోతైన అధ్యయనం, సమకాలీన రాజకీయాలపై సమగ్ర అవగాహన కలిగిన దేవేందర్ గౌడ్ మంచి వ్యక్తిగా, వక్తగా, మేధావిగా పేరుతెచ్చుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం కృషి సల్పారు. 1988-1993 మధ్యకాలంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్రంలోని జిల్లా పరిషత్ చైర్మన్‌ కన్వీనర్‌గా స్థానిక సంస్థల బలోపేతానికి, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. తదుపరి 1994, 1999, 2004లలో వరుసగా 3 సార్లు శాసనసభ్యునిగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర క్యాబినెట్‌లో వెనుకబడిన కులాల సంక్షేమం, ప్రొహిబిషన్ – ఎక్సైజ్, కోఆపరేటివ్; రెవెన్యూ మరియు పునరావాసం; హెం మరియు సినిమాటోగ్రఫీ శాఖలను 10 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో పలు క్యాబినెట్ సబ్ కమిటీలకు చైర్మన్ గా, సభ్యునిగా ఉన్నారు. ముఖ్యంగా పరిపాలన సంస్కరణల కమిటీకి అధ్యక్షునిగా ఉండి, పరిపాలనలో అనేక సంస్కరణలకు మార్పులకు నాంది పలికారు. 2004-2009 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్ గా వ్యవహరించి.. ప్రజా సమస్యలను సూటిగా, స్పష్టంగా లేవనెత్తి అందరి ప్రశంసలు అందుకొన్నారు. ‘2012 మే’ లో శ్రీ దేవేందర్ గౌడ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

నా మాట..

కాలగమనానికి ఎవరితోను ప్రమేయం లేదు. అదొక నిరంతర ప్రవాహం. కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకొంటూ సమాజాభివృద్ధిలో మనిషి ఏ విధంగా భాగస్వామ్యం కాగలిగాడన్నదే ముఖ్యం. తన సొంత అభివృద్ధికి, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. దానికి మించిన బాధ్యతలు ప్రతి మనిషికి ఉంటాయి. ఏ వ్యక్తికి సరిహద్దులు లేవు. ఏ ఒక్కరూ గిరిగీసుకొని బ్రతకకూడదు. మానవాళి శ్రేయస్సు కొరకు తమ జీవితాల్ని అంకితం చేసిన మహనీయులు అన్ని రంగాల్లో కనిపిస్తారు. మానవాళిని కబళించిన అనేక జబ్బుల్ని నిరోధించడం మొదలుకొని రోదసీ రహస్యాలను చేధించడం మరియు శాస్త్ర, సాంకేతిక రంగాలలో వారు అలుపెరగని పరిశోధనలు సాగిన ఫలితంగానే నేడు సమాజంలో గతంలో ఎన్నడూ ఊహించనటువంటి అభివృద్ధి సాధ్యపడింది. అనేక సౌకర్యాలు సమాజానికి అందుబాటులోకి వచ్చాయి.

ప్రపంచ జనాభాలో 6వ వంతు.. 130 కోట్ల మంది ప్రజలు.. అందులో అధికశాతం యువత ఉండటం భారతదేశానికి ఓ సువర్ణావకాశం. అవసరమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తే.. భారతీయుల శక్తి సామర్థ్యాలు దేశానికి, మొత్తంగా ప్రపంచ మానవాళికి ఉపయోగపడగలవు. గతంలో భారతదేశం పారిశ్రామిక విప్లవాన్ని అందిపుచ్చుకోలేక అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటి ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలి. దేశంలో అపారంగా సంపద సృష్టి జరుగుతున్నది. అయితే, సృష్టించబడుతున్న సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం వల్ల ధనిక, పేదల మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోతున్నది. ఫలితంగా.. పేదరిక నిర్మూలన ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇది మంచిది కాదు. దీనివల్ల భవిష్యత్తులో అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి (ఇన్ క్లూజివ్ గ్రోత్) కి దోహదం చేసే విధానాల్ని అమలు చేస్తేనే.. ఆర్థిక అసమానతలు తగ్గుతాయి.

అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో వ్యవస్థాగతమైన లోపాలు అనేకం ఉన్నాయి. నిరక్షరాస్యత, అనారోగ్యం, పేదరికం, ఉపాధిలేమి వంటి సమస్యల్ని పరిష్కరించే సమర్థవంతమైన విధానాలు, ప్రణాళికలు గతంలో అరకొరగానే అమలు జరిగాయి. ప్రజల తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు తదితర ప్రాధాన్యతలను ఏర్పచుకోవడంలో లోపభూయిష్టమైన కార్యాచరణ వల్ల సమస్యలు అంతకంతకూ పెరిగాయి. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు, ఉపాధి కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత తగ్గింది. మానవీయకోణంలో రాజ్యాంగం నిర్దేశించిన మార్గంలో కాకుండా ప్రజలను ఓటర్లుగా పరిగణిస్తూ ఓట్లు రాల్చే కార్యక్రమాలకు, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకొనే పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ వ్యవస్థను కొన్ని రాజకీయ పార్టీలు, కుటుంబాలు శాసించే స్థాయికి చేరి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నాయి. కులాన్ని, మతాన్ని ఉపయోగించుకోవడానికి, రకరకాల సెంటిమెంట్లను ప్రేరేపించడానికి రాజకీయ పార్టీలు ఏమాత్రం సంకోచించడం లేదు. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు రాజకీయ పార్టీలు తిలోదకాలు ఇస్తున్నాయి. మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు ఉండటం వల్ల.. ఎన్నికల సమయంలో ఆ ఓట్లను కొల్లగొట్టడానికి ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వడం; డబ్బులు, మద్యం పంచడం, భయపెట్టడం, ప్రలోభపెట్టడం మొదలైన అరాచక విధానాలకు దిగజారడం సర్వసాధారణంగా మారింది. ఒకసారి అధికారంలోకి వచ్చాక, ప్రజలకు చెందాల్సిన వనరులపై వివిధ మార్గాల ద్వారా ఆధిపత్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో తాము చేసిన ఖర్చుకు ఎన్నో రెట్లు రాబట్టుకొనే మార్గాలను అన్వేషిస్తున్నారు. రాజకీయ పార్టీల ఎజెండా మొత్తం ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నది. కార్పొరేట్ శక్తులు రాజకీయ పార్టీలను, రాజకీయ వ్యవస్థలను తమ కనుసన్నల్లో నడిపిస్తూ, వాటిని శాసించే స్థాయికి ఎదిగాయి. ఒకప్పుడు కొన్ని రాజకీయ పార్టీలకు సిద్ధాంతకర్తలు వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితి ఉంటే, నేడు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే వారే పెద్దదిక్కుగా తయారయ్యారు. అగ్రకులాల వారితోను, సంపన్నులతోను చట్టసభలు నిండిపోతున్నాయి. ఏ ఒక్క కులం కూడా పాలక వర్గంగా మారకూడదు, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు ఇది విరుద్ధం. కానీ, వేలాది కులాలున్న మన బహుళ సమాజంలో సామాజికన్యాయం చేయాలన్న కనీస ఆలోచన కొన్ని రాజకీయ పార్టీలలో కనిపించడం లేదు. ఈ విపరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాల్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్నికలలో డబ్బుకు ప్రాధాన్యత లేకుండా చేయాలి. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంచేందుకు, వాటి కార్యకలాపాలపై పారదర్శకత తేవడానికి ‘ఎన్నికల కమిషన్’ వంటి వ్యవస్థలు నడుం బిగించాలి, సంస్కరణలు తేవాలి. ఇది ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత కీలకం.

ప్రపంచంలోని పలు దేశాలలో పర్యటించి అక్కడి స్థితిగతులను పరిశీలించే అవకాశం నాకు లభించింది. అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో పుష్కలమైన సహజ సంపద ఉంది. విలువైన నదీ జలాల్ని అడవుల్ని, ఖనిజాల్ని, సారవంతమైన భూముల్ని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించగలిగితే.. పేదరికం అన్నది ఈ దేశం దరిదాపుల్లో కూడా రాదు. మనతోపాటు కొంచెం అటుఇటుగా స్వాతంత్రం పొందిన దేశాలు.. ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి. అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకు సాగాయి. కానీ, మన దేశం మాత్రం అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా మానవ వనరులను సద్వినియోగ పర్చుకోవడంలో మనం వెనుకబడ్డాం. అలాగే.. అధికార, వనరుల వికేంద్రీకరణ జరిగాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. అప్పుడే అభివృద్ధి క్రిందిస్థాయి నుండి మొదలవుతుంది. గాంధీజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుంది.

దేశ జనాభాలో ఇప్పటికీ 60% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అందులో ఎక్కువ మంది వ్యవసాయం మీద, చేతివృత్తుల మీద ఆధారపడుతున్నారు. ఆహార ధాన్యాల కొరకు దిగుమతులపై ఆధారపడకుండా ఆధునిక శాస్త్రీయ విధానాల ద్వారా నీటి వనరులను సద్వినియోగపర్చుకొని వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి సాధించాలి. ముఖ్యంగా రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలి. చేతి వృత్తులను ఆధునీకరించి.. వారి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లేకపోవడం ఇంకా అనేక ఇతర కారణాల మూలంగా దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నది. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కార మార్గాల్ని అమలు చేయాలి. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలను ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. చాలా దేశాల్లో.. లింగవివక్ష లేదు. కానీ, మన దేశంలో మాత్రం జనాభాలో 50%గా ఉన్న మహిళలకు సమాన అవకాశాలు ఎన్నడూ కల్పించలేదు. శతాబ్దాలపాటు కట్టుబాట్లు, ఆచారాల పేరుతో అన్ని రంగాలకూ దూరంగా పెట్టి అన్యాయం చేశారు, అణగదొక్కారు. ఇప్పటికీ దేశంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతున్నది. వారి శక్తిసామర్థ్యాలకు తగిన ప్రతిఫలాన్ని సమాజం పొందలేకపోతోంది. మహిళల భాగస్వామ్యం లేకుండా భారత్ అగ్రస్థానం చేరుకోలేదన్నది వాస్తవం. ఈ పరిస్థితి మారాలి. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి. మహిళలకు స్వేచ్ఛ అవసరం. చేసే వృత్తికి అనువైన దుస్తులు ధరించడం మొదలుకొని.. నచ్చిన రంగాలలో పనిచేసే అవకాశాలను ఎంచుకొనే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి. మహిళా సాధికారత కొరకు సమాజం సంపూర్ణంగా కృషి చేయాలి.

భారతదేశంలోని చాతుర్వర్ణ వ్యవస్థకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దానివల్ల సమాజానికి అపార నష్టం వాటిల్లింది. అయితే, ఇప్పుడిప్పుడే దాని ప్రభావం తగ్గుతున్నప్పటికీ.. దేశంలో అమలవుతున్న అస్తవ్యస్థ విద్యావిధానం వల్ల మరోరూపంలో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న విద్యాసంస్థలు, ఎగువ తరగతి పిల్లలు వెళుతున్న విద్యాసంస్థలు; మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు వెళుతున్న విద్యాసంస్థల మధ్య మౌలిక సదుపాయాల్లో, విద్యా ప్రమాణాల్లో ఎంతో అంతరం ఉంది. ఇక.. పేదలు, నిరుపేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు సైతం వెళ్లే పరిస్థితి లేదు. దీనివల్ల సమాజంలో యువత ఆలోచనల్లోనే ఎంతో వ్యత్యాసం ఏర్పడుతున్నది. సమాజంలో వివిధ వర్గాల మధ్య కనిపించని అడ్డుగోడలు ఏర్పడతాయి. అందరికీ సమానమైన విద్య అందుబాటులోకి వస్తే.. ఒకే సమాజంలో భిన్న ప్రపంచాలు ఏర్పడవు. విద్యను వ్యాపారంగా మార్చకూడదు. అభివృద్ధి చెందిన దేశాలలో అమలు జరుగుతున్న విద్యావిధానాన్ని మనం స్వీకరించాలి. అదేవిధంగా.. వైద్య సదుపాయం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలి. ఏ ఒక్కరూ తమ దగ్గర డబ్బులేని కారణంగా చికిత్స చేయించుకోలేని దుస్థితి ఉండకూడదు. ఆధునిక వైద్యం పొందడం అందరికీ హక్కు కావాలి.

న్యాయవ్యవస్థ పట్ల ప్రజల నమ్మకం పెరగాలి. వేగంగా నాణ్యతతో కూడిన న్యాయవ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి రావాలి. చట్టాలు పటిష్టంగా అమలు జరగాలి. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు ఒకదానికొకటి సమన్వయంతో సమాజ అవసరాలకు ఉపయోగపడేవిధంగా పనిచేయగలగాలి. కాలానుగుణంగా అన్ని వ్యవస్థలను మెరుగుపర్చుకోవడం, ఆధునీకరించడం, ప్రజా ప్రయోజనాలకు, వారి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. కులం, మతం, వర్గం వంటి సంకుచిత ధోరణులను, మూఢనమ్మకాలను వదిలిపెట్టి ప్రజలు వివేకంతో విశాల దృక్పథంతో ఆలోచించాలి.

గతంలో మొదలుపెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా.. మౌలిక వసతుల కల్పన వల్ల, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక ప్రభుత్వాలకు కూడా ఇటీవలికాలంలో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతున్నది. ఆర్థిక వనరులను పొదుపుగా ప్రాధాన్యత క్రమంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులోకి వచ్చిన ఆర్థిక వనరుల్ని దూరదృష్టితో నిజాయితీగా, నిస్వార్ధంగా మానవీయ కోణంలో ఉపయోగించుకోగలిగితే.. సమాజంలోని పేదలు, బడుగు బలహీనవర్గాల జీవితాలు మెరుగుపడానికి ఎంతో ఆస్కారం ఉంది. అప్పుడే పరిపాలనలో, అభివృద్ధిలో ఇంక్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి) కనపడుతుంది. అభివృద్ధితోపాటు కొన్ని కొత్తకొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కానీ, వాటిని పరిష్కరించుకోగలగాలి. జీవన శైలిలో మార్పుల వల్ల ఇటీవల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. చిన్ననాటి నుండి ఇప్పటివరకు నేను నడక, సైక్లింగ్, యోగా వంటివి అలవాటు చేసుకున్నాను. ఇటీవల నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ.. వాటిని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అధిగమించగలిగాను. అందరూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

సాంకేతిక విప్లవం కారణంగా నేడు యావత్ ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థల అనుసంధానం తదితర మార్పుల ఫలితంగా గతంలో లేనటువంటి పలు అవకాశాలు లభిస్తున్నాయి. దేశంలో అన్ని మతాల వారు సామరస్యంతో పరస్పర సహకారంతో ముందుకుసాగాలి. శాంతికోసం పాటు పడాలి. సమీప భవిష్యత్తులో పేదరికంలేని, ఆర్థిక అంతరాలులేని అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమసమాజ నిర్మాణం జరగాలని, ప్రజాస్వామిక వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ ప్రజలే పాలకులు కావాలన్నది నా కోరిక. ఈ బాధ్యతలను ప్రజలు తప్పక స్వీకరిస్తారన్న విశ్వాసం నాకుంది. ప్రజాస్వామ్యంలో పరిష్కార కర్తలు మరెవరోకాదు.. ప్రజలే!

నా బాల్యం..

ఓ ఆకుపచ్చని జ్ఞాపకం

మనిషి జీవితంలో బాల్యాన్ని మించిన అద్భుత దశ ఏముంటుంది?బాల్యాన్ని తలుచుకోవడం, బాల్యంలోకి వెనక్కి ప్రయాణించడం కంటే మించిన ఆనందం మనిషికి మరొకటి ఉండదేమో! నాకూ అంతే!

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని నేను నడియాడిన నేలను ఏదో ఒక సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందే! బాల్యం నాటి జ్ఞాపకాలు, సొంతూరు ముచ్చట్లు మనల్ని హుషారు పరుస్తాయి. సంతోషపెడతాయి. సహచరులతో కలిసిమెలిసి పెరిగిన అనుభూతులు అనిర్వచనీయమైనవి. చిన్ననాటి మిత్రులతో ఆడిన ఆటపాటలు, పడిన తగువులు.. ఇలాంటివెన్నో గుర్తొచ్చి మనసును పులకరింపజేస్తాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఆకుపచ్చగా నిన్నమొన్న జరిగినట్లుగా అనిపిస్తుంటాయి. ఊహ పెరిగేకొద్దీ, చుట్టూ ఉన్న పరిసరాలను గమనించేకొద్దీ.. ఆనందింపజేసే సంఘటనలతోపాటు నాటి సామాజిక స్థితిగతులననుసరించి మనకు సంబంధం లేకుండానే బాధపెట్టే ఉదంతాలూ కొన్ని జరుగుతుంటాయి. నిజానికటువంటివి భావిజీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా రాటుదేలుస్తాయి.

నాకు జన్మనిచ్చిన పుణ్యదంపతులు శ్రీమతి సత్తెమ్మ, శ్రీ సాయన్న.. మార్చి 18, 1953న తుక్కుగూడ గ్రామంలో పుట్టాను. నాకు ముందు ముగ్గురు అక్కలు ఒక అన్న. నా తర్వాత చెల్లి, తమ్ముడు. పెద్ద కుటుంబం. నిండైన సంసారం మాది.

మా ఊరు.. తుక్కుగూడ. చారిత్రక నగరం హైదరాబాద్ కు కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నా కాని.. నా చిన్నప్పుడు మా ఊరు విద్య, వైద్యం, అభివృద్ధి అనేవాటికి చాలా దూరం. ఊళ్లో సరైన మట్టిరోడ్లు కూడా లేకుండె. వాగు ఉంది. ఇళ్లకు కరెంట్ కూడా లేకుండె. ఇళ్లకు కిరోసిన్ దీపాలే ఆధారం. ఊళ్లో అందుబాటులో కనీస వైద్య సౌకర్యాలు లేకుండె. భూస్వాములు, ధనవంతులు, పేదవాళ్లు.. ప్రజల మధ్య ఇలాంటి భేదాలు కూడా ఉండేవి కావు. ఎందుకంటే మా ఊళ్లో అందరి బతుకులు దాదాపు ఒకేలా ఉండేవి. అందరికీ ఒకటే కష్టం. ఒకటే కులం.. అదే పేదరికం. ఒకటీ అరా వ్యవసాయ భూములు ఉన్నా ఎక్కువమంది తెల్లవారే సరికి చేతిలో కొడవళ్లు పట్టుకుని పక్కనే ఉన్న అడవికి బయలుదేరే వారు. సంచుల నిండా గడ్డి కోసుకొచ్చి ఇంటి దగ్గర గడ్డివాములు వేసుకునేవారు. రెండు రోజులకొకసారి గడ్డిని బండ్లకెక్కించి అమ్ముకోడానికి పట్నం వెళ్లేవారు. నాలుగు రూపాయలు వస్తే వాటితో ఇల్లు గడుపుకునేవారు. కొంత చదవడం రాయడం వచ్చు కనుక మా నాన్న గడ్డి కాంట్రాక్టర్ గా మారాడు. అమ్మ సత్తెమ్మ ఇంటిపట్టునే ఉండేది. అన్నకి చదువంటే ప్రాణం. నాక్కూడా! కాని నాకు నాన్నతో అడవికి వెళ్ళాలని ఉండేది. నాన్న పెద్దగా చదువుకోలేదు గాని పేపర్ చదవడం వరకూవచ్చు. తన పిల్లలందరూ బాగా చదువుకొని పట్నంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని అందరితో అనేవాడు. అదే తన జీవితాశయం అనుకునేవాడు.

అప్పట్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండేదో నాకు పూర్తిగా గుర్తులేదు గానీ.. మా ఊళ్లో మాత్రం ఏ ఒక్క మనిషి చదువు మాట ఎత్తేవాడు కాదు. దానికి పేదరికం కంటే విద్య గురించి కనీస అవగాహన లేకపోవడమే కారణం. అందుకే పదిహేనువందల మంది జనాభా ఉన్న మా ఊళ్లో ఒక పాఠశాల ఉండాలని కూడా ఎవరూ అనుకునేవారు కాదు. ఊరందరిలో పిల్లల్ని చదివించాలన్న బలమైన కోరిక ఒక్క మా నాన్నలోనే చూశాను. మేమందరం ఊళ్లోని హనుమంతుని గుళ్లోనే చదువుకున్నాం. ఆ రోజులు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. “పొద్దున ఎనిమిదింటికల్లా నాతోటి పిల్లలందరూ రెడీ అయిపోయి ఊళ్లోని హనుమంతుని దేవాలయానికి వచ్చేసేవారు. నాలుగు స్తంభాల పైకప్పు ఇచ్చే నీడలో సగభాగం దేవుడికిచ్చేసి మిగతా స్థలంలో మేమందరం వరసగా కూర్చునేవాళ్లం. గుడి, బడి రెండూ హనుమంతుని వరండాలోనే. ఆ గుడి అరుగుపైనే! ఆనాడు మా సార్లు మా చదువుల కోసం శ్రద్ధ పెట్టకపోతే మా ఊరి గురించి ఎవ్వరికీ తెలిసేది కాదేమో. మా ఊళ్లో సంపన్నులు లేరు, సంపద లేదు, చైతన్యం లేదు. మా రోజుల్లో నానాపాట్లుపడి చదువుకున్నవారే మా ఊరికి గుర్తింపు తీసుకొచ్చారు. మా సార్లు పాఠాలతోపాటు, పురాణాలు, పిట్టకథలు, నీతికథలు ఎక్కువగా చెప్పేవారు.

ఊళ్లో బతుకమ్మ పండుగను అందరూ సంబరంగా చేసేవారు. పూలు తేవడానికి గుట్టలెక్కేవాళ్లం. పీర్ల పండగను కూడా బాగా జరుపుకునేవాళ్లం. ఇక, పతంగుల పండుగ వచ్చిందంటే.. పిల్లల ఆనందానికి అడ్డే ఉండేది కాదు. ఆ సెలవుల్లో, రోజులో ఎక్కువ సమయం మా ఊళ్లో ఉన్న వాగు దగ్గరకెళ్లి ఆటలాడుకొనే వాళ్లం. పెద్దవాళ్లు వచ్చి కేకలు వేసినా వాగులోంచి కదిలే వాళ్లం కాదు. ఆ విధంగా చాలా స్వేచ్ఛగా పెరిగాం.

చిన్నతనంలో ఉదయాన్నే లేచి.. సూర్యోదయాన్ని పరికించడం, కిలకిలరావాలు చేస్తూ… ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగిరే పక్షుల్ని చూస్తుంటే నాలో ఏదో ఒక అలౌకిక ఆనందం కలిగేది. పక్షుల్లాగే.. మనుషులు కూడా ఎటువంటి భయాలు, ఆందోళనలు, బానిసత్వపు సంకెళ్లు లేకుండా స్వేచ్ఛగా సంచరించగలిగితే ఎంత బావుణ్ణోకదా.. అనే భావన నాకు అప్పట్నుంచే కలిగింది.

మేము పెద్దవాళ్లమయ్యేలోపు పరిసర ప్రాంతాల్లో ఎన్నో చేదు సంఘటనలు చూడాల్సివచ్చింది. ముఖ్యంగా ఊళ్లో వైద్య సదుపాయం లేకపోవడంతో అనారోగ్యాలకు ఎంతోమంది బలయ్యేవారు. నాకు పదేళ్ల వయసుండగా ఒకరోజు అమ్మకు జబ్బు చేసింది. ఎంతకూ తగ్గలేదు. రోజులు, వారాలు గడిచిపోయాయి. ఎవరో నాటువైద్యుడు వచ్చి చూసి జబ్బు బాగా ముదిరిపోయింది లాభం లేదన్నాడు. కుటుంబం అంతా బోరుమంది. కానీ ఆ వైద్యుడు తనవల్ల కాదని వదిలేసి వెళ్లిపోలేదు. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసికెళతానన్నాడు. మొట్టమొదటిసారి వైద్యం కోసం ఊరి దాటి వెళ్లిన వ్యక్తి మా అమ్మేనేమో. ఉస్మానియాలో చేరాక అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. ఆ నాటువైద్యుడే గనక ఆ రోజు మా అమ్మని హైదరాబాద్ తీసికెళ్లకపోతే అమ్మ మాకు దక్కేది కాదు. నేను పెద్దయ్యాక మాపాలిట దేవుడిగా వచ్చిన ఆ వైద్యుడి ఆచూకీ కోసం చాలా వెతికాను, కాని దురదృష్టవశాత్తు నా ప్రయత్నం ఫలించలేదు.

మూడవ తరగతి వరకూ తుక్కుగూడలోనే చదువుకున్న మేము పైచదువులకు హైదరాబాద్ పాత బస్తీకి వచ్చేశాము. పాఠశాల చదువు పూర్తయ్యాక చార్మినార్ సమీపంలో ఉన్న ధర్మవంత్ కాలేజీలో ఇంటర్మీడియట్, తర్వాత కాచిగూడలోని భద్రుకా కాలేజీలో బీకాం పూర్తి చేశాను. జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ యూనియన్ కు ప్రెసిడెంట్ గా పనిచేశాను. కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. మా మామయ్య సర్పంచ్ కావడంతో.. వారి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడునయ్యాను. అందుకే నేను అన్నయ్యలా చదవలేకపోయాను. అన్న యాదయ్య డాక్టర్ అయ్యాడు. ఊళ్లో పెద్ద చదువు చదువుకున్న మొదటి వ్యక్తి తనే. నాన్నకు నన్ను కూడా డాక్టర్ ను చేయాలని ఉండేది. నేను, తమ్ముడు డిగ్రీలు పూర్తిచేశాం.

చిన్నప్పుడు చదువుకోవడానికి మేము పడిన కష్టాలు.. మా గ్రామంలోని పిల్లలు పడకూడదనే ఉద్దేశంతోనే నేను జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు తుక్కుగూడలో ప్రభుత్వ పాఠశాల పెట్టించాను. మంత్రి అయిన తర్వాత మా ఊళ్లో పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవడానికి పక్క ఊళ్లకు వెళ్లే అవసరం లేకుండా నేను నా సొంత డబ్బులతో ‘దేవేంద్ర విద్యాలయం’ పేరుతో స్కూల్ కట్టించాను. ప్రస్తుతం అందులో దాదాపు 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో నాల్గోవంతు మంది పేదవిద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడం నాకెంతో సంతృప్తి కలిగిస్తుంది. ఆనాడు మంత్రిగా ఉండి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించాను. తుక్కుగూడలో ప్రభుత్వ స్థలం లేకపోవడం వల్ల అది అక్కడి నుంచి వేరే చోటుకు తరలిపోకూడదనే ఉద్దేశంతో నేనే 10 ఎకరాల స్థలం పాఠశాలకు ఇచ్చాను. గ్రామంలో బీసీ హాస్టల్ కూడా కట్టించాను. విద్య, వైద్య సౌకర్యాలు లేక మేము ఇబ్బందిపడిన క్షణాలే ఇప్పటికీ నన్ను వెంటాడుతుంటాయి. అందుకే విద్యకు సంబంధించి ఏ విషయంలోనైనా మా ఊరి పిల్లవాళ్లకు లోటు ఉండకూడదని అనుకుంటాను. రెండోది వైద్యం. ప్రస్తుతం ఊళ్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులున్నా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాల్సిందే. ఆ ఇబ్బందిని కూడా పరిష్కరించాలనే సంకల్పం నాలో ఉంది.

కుటుంబం

భారత సమాజానికి బలమైన పునాది ‘కుటుంబ వ్యవస్థ’. కుటుంబానికి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలబడాల్సిన బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుందని నేను నమ్ముతాను. ఆ కారణంగానే నేను రాజకీయాల్లో ప్రవేశించిన నాటికి నా ముగ్గురు మగ పిల్లలు చిన్నవారైనప్పటికీ వారికి తగిన సమయాన్ని కేటాయించి వారి బాగోగులను చూసుకున్నాను. తండ్రిగా నేను వారికి ఉన్నత చదువులు చదివించాను. తదుపరి వారికి వివాహాలు నిర్వహించి నా బాధ్యతలను నెరవేర్చాను. నా సతీమణి సహకారంతో కుటుంబ ఉన్నతికి కృషి చేశాను.

ప్రజా జీవితంలో తొలి అడుగు

విరామం ఎరుగని పయనంలా సాగుతున్న నా రాజకీయ జీవితంలో పడిన తొలి అడుగులు నాకు ఇప్పటికీ మధురస్మృతులే! నేను పుట్టిన ‘తుక్కుగూడ’ హైదరాబాద్ కు అతిసమీపంలో ఉన్నప్పటికీ.. మా గ్రామంలోగానీ చుట్టుపక్కల ప్రాంతాలలోగానీ చెప్పుకోదగ్గ రాజకీయ చైతన్యం కన్పించేది కాదు.కొన్ని కులాలవారు, వర్గాలవారు పెత్తందారీ మనస్థత్వంతో.. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా తమకు తామే పాలక వర్గాలుగా భావిస్తూ.. మిగతావారిని రాజకీయంగా అణచివేస్తూ.. సమాజంలోని అన్ని రంగాల్లోకి విస్తరించి వారే ఆధిపత్యం వహిస్తున్న పరిస్థితుల్లో.. ఫ్యూడల్ శక్తులకు ఎదురుచెప్పే ధైర్యంలేక అన్యాయాలను మౌనంగా భరిస్తున్న వర్గాల నుండి ఓ సామాన్య కుటుంబ వ్యక్తి రాజకీయాల్లోకి రావడం నిజంగా ఓ అసాధారణ పరిణామమే!

ఆనాటి పరిస్థితులలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ప్రతిపక్ష పాత్ర కూడా కాంగ్రెస్ లోని వర్గాలే పోషించేవి. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్న కలుషిత రాజకీయాలను గమనించి.. ఆ వాతావరణానికి సంబంధంలేని రంగాలలో ప్రవేశించాలని.. ముఖ్యంగా ఏదైనా వ్యాపారంగానీ లేదా ప్రభుత్వోద్యోగంలోగానీ చేరాలనుకొన్నాను. అయితే ఆ సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారాయి.

1982లో ప్రఖ్యాత సినీనటులు శ్రీ నందమూరి తారకరామారావుగారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. ఉన్నతమైన సిద్ధాంతాలను, విధానాలను ప్రకటించి ప్రజల ఆదరణతో.. 1983లో అధికారంలోకి వచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన అంకిత భావంతో పేద ప్రజల సంక్షేమానికి సామాజిక న్యాయం చేయడానికి కృషి చేస్తున్న తీరును చూసి రెండో ఆలోచన చేయకుండా నేను ‘తెలుగుదేశం’లో చేరాను. స్వల్ప వ్యవధిలోనే నేను ఎస్.టి.రామారావు దృష్టిని ఆకర్షించడం; ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆయన 1988లో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించి పార్టీ టిక్కెట్ ఇవ్వడం జరిగాయి. ఎన్నికల్లో నా గెలుపునకు ఎన్టీఆర్ చైతన్య రథంపై తిరిగి ప్రచారం చేశారు.

జడ్పీ చైర్మన్ గా అభివృద్ధికి అంకురార్పణ

మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష విధానంలో జరిగిన జడ్పీ ఎన్నికలలో నేను భారీ మెజార్టీతో గెలిచాను. జడ్పీ చైర్మన్ గా నేను రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్లాను. అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా చూశాను, ప్రజలను అడిగి తెలుసుకున్నాను. గ్రామాల్లో ఎన్నో సమస్యలున్నా.. ముఖ్యంగా విద్య ఎంత నిర్లక్ష్యానికి గురైందో కళ్లారా చూశాను. ఒక పట్టుదలతో, దీక్షతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చి విద్యార్థుల అటెండెన్స్ ను పెంచడానికి కృషి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇబ్బందులను కూడా పరిష్కరించడానికి కృషి చేయడం వల్ల జిల్లాలో విద్యారంగం గణనీయంగా మెరుగుపడింది. నేను జడ్పీ చైర్మన్ గా గెలిచిన కొంతకాలానికే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. 1989 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చీరాగానే, అత్యధిక జడ్పీ చైర్మన్లు ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి అనేక పేచీలు పెట్టుకొన్నారు. నిధులు, విధులు, అధికారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది. హక్కుల పరిరక్షణ కోసం జడ్పీ చైర్మన్లు అందరూ సంఘటితం కావాలనే ఉద్దేశంతో.. జడ్పీ చైర్మన్లుగా వయస్సులో, అనుభవంలో నాకంటే పెద్దవారు ఉన్నప్పటికీ.. వారందరూ నన్ను జడ్పీ చైర్మన్ల కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది. నా రాజకీయ జీవితంలో అదొక ప్రధాన మలుపు.

జడ్పీ చైర్మన్ల కన్వీనర్ గా హక్కులకై పోరాటం

జడ్పీ చైర్మన్ల కన్వీనర్ గా నాకు లభించిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. ప్రజా సమస్యలను, స్థానిక ప్రభుత్వాలకున్న విధులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాను. జడ్పీ చైర్మన్ల కన్వీనర్ హెూదాలో 3 ప్రాంతాలలో నిర్వహించిన సదస్సుల్లో పాల్గొని ఆనాటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పెత్తనంపై తగిన కార్యాచరణతో పోరాడాము. ప్రజల మద్దతును కూడగట్టాము. ఫలితంగానే, 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి మేము చేసిన పోరాటం కూడా దోహదపడింది.

ప్రజా జీవితంలో నిజాయితీతో నిర్భయంగా నిబద్ధతతో పని చేయగలిగే అవకాశం లభించడం నా అదృష్టం. ప్రజాసేవను ఓ దైవకార్యంగానే భావించాను. ఎన్నడూ ఎక్కడా రాజీ పడలేదు. స్థానిక ప్రజా ప్రతినిధుల్ని, అధికారుల్ని సమన్వయం చేసుకొంటూ ప్రజలకు చేరువకాగలిగాను. క్లిష్టమైనవిగా భావించిన ఎన్నో సమస్యల్ని పట్టుదలతో కృషి చేసి అందరి సహకారంతో పరిష్కరించడం నాకు తృప్తినిచ్చే అంశాల్లో ఒకటి. ప్రారంభంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబునాయుడులు అందించిన సహకారం.. పార్టీ సహచరుల తోడ్పాటు అమూల్యమైనవి. కష్టపడితే సామాన్యులు సైతం జీవితంలో ఏదైనా సాధించవచ్చునని నిరూపితమైంది.

క్యాబినెట్ మంత్రిగా..
పరిపాలనలో సొంత ముద్ర

‘పరిపాలన’ అన్నది ఓ సాధారణ ప్రక్రియ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడం ఓ గొప్ప ‘కళ’. సమర్థవంతమైన నాయకత్వమే ప్రభుత్వ యంత్రాంగానికి దశ, దిశ నిర్దేశం చేయగలుగుతుంది. ఏ ప్రభుత్వమైనా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమాన్ని ఏర్పర్చుకోవాలి. అందుబాటులో ఉన్న వనరుల్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సిబ్బంది నైపుణ్యాలను ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సమర్ధవంతంగా వినియోగించుకోగలగాలి. పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి ప్రజలపై భారం పడకుండా కొత్త వనరులను సృష్టించుకోగలగాలి. భవిష్యత్తు తరాల అవసరాలను కూడా గమనంలోకి తీసుకొని దూరదృష్టితో నిర్ణయాలు చేయాలి. ముఖ్యంగా, ప్రజలను వీలైనచోట్ల భాగస్వామ్యులను చేయగలగాలి. నిరంతరంగా లోటుపాట్లపై సమీక్ష జరగాలి. నేను రెవెన్యూ శాఖామంత్రి, తదుపరి హెూంమంత్రిగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన కాలంలో రెండు శాఖల్లో అనేక కీలక సంస్కరణలకు అంకురార్పణ చేశాము. సరికొత్త పని సంస్కృతిని నెలకొల్పి మేము తెచ్చిన మార్పులు, ఏర్పరిచిన విధానాలు దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచాయి. చక్కని ఫలితాలు అందించాయి.

రెవెన్యూ సంస్కరణలు

సహకారరంగంలో ‘మాక్స్’ చట్టానికి రూపకల్పన

సహకార మంత్రిగా ఉండగా… కోపరేటివ్ చట్టాలను కూలంకుషంగా అధ్యయనం చేసి ‘మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీస్ యాక్ట్’ (మాక్స్ చట్టం) తీసుకురావడం జరిగింది. దీనికి అన్ని వర్గాల నుండి సానుకూల స్పందన రావడమే కాకుండా ఈ చట్టాన్ని మనదేశంలోని కొన్ని రాష్ట్రాలే కాకుండా శ్రీలంక, మలేషియా దేశాలు కూడా ఈ చట్టాన్ని తీసుకురావడం విశేషం.

రెవెన్యూ సంస్కరణలు

రైతులకు తమ భూమిపై హక్కు ఉండేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేశాం. తద్వారా పాస్ పుస్తకాల ఆధారంగా రైతులు ఋణాలు పొందటానికి అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని కంప్యూటర్లలో భద్రపర్చడం ద్వారా భూవివాదాలను తగ్గించాము.

రెవెన్యూశాఖను ప్రజలకు మరింత చేరువ చేశాం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లలో రూపకల్పన చేసిన కార్డు ప్రాజెక్టు పలువురి ప్రశంసలు అందుకుంది. రెవెన్యూ కోడ్ లకు రూపకల్పన చేశాం.

రెవెన్యూ పన్ను వసూళ్లను, భూమి శిస్తు వసూళ్లను సులభతరం చేయడం జరిగింది. రెవెన్యూశాఖను మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాము. పరిపాలనా సంస్కరణల ద్వారా ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వాన్ని తీసుకువెళ్లవచ్చని ఆచరణలో చూపాము. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించడం జరిగింది. రెవెన్యూ మంత్రిగా నేను తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలు ప్రజల ప్రశంసలు పొందాయి.

రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రిగా రెవెన్యూ మాన్యువల్ రూపొందించడానికి చొరవ చూపడం జరిగింది. రెవెన్యూ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టాము. నిరుపేదల ముంగిట్లోకి రెవెన్యూ పాలనను తీసుకురావడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందాలని ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు మరింత అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేసి, రెవెన్యూశాఖకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు.

కుల ధృవీకరణ పత్రాలను ఒకేసారి జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నాము. గీత కార్మికులకు మరియు ఇతర వృత్తిదారులకు 5 ఎకరాల వరకు భూములను అందించేందుకు జీవోలను జారీ చేయడం జరిగింది.

హెూంశాఖలో సంస్కరణలు

నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెూంశాఖమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన పలు విప్లవాత్మక చర్యలు, సంస్కరణలు పరిపాలనాగతిని మార్చడానికి దోహదం చేశాయి. అప్పటివరకూ నిత్యం నక్సలైట్ల హింస, తీవ్రవాదుల అరాచకాలు, హింసతో రాష్ట్రంలో అశాంతి నెలకొన్న నేపథ్యం. ప్రజలు, పోలీసులు, నక్సలైట్ల మధ్య అంతరాలుండేవి. రాష్ట్ర హెూంశాఖామంత్రిగా పోలీసు శాఖలో చేపట్టిన సంస్కరణలు పోలీసు శాఖకు ప్రజలకు మరింత చేరువ చేశాయి.

సామాజిక, ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా అశాంతి, ఆందోళనలను నివారించగలిగాము. ముందుచూపుతో, పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణల వల్ల నక్సలైట్ల లొంగుబాట్లు పెరగడం జరిగింది. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసారు. లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసానికి చర్యలు చేపట్టి, వారు నూతన జీవితాలలో స్థిరపడటానికి దోహదం చేయగలిగాము. ఐ.ఎస్.ఐ లాంటి తీవ్రవాద సంస్థల కార్యకలాపాల్ని పోలీసుశాఖ అణచివేసింది.

పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, సామాజిక, సేవా కార్యక్రమాల్లో, సమాజహితం కొరకు పలు కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారు ప్రజలకు మరింత చేరువయ్యారు.

ఆ సమయంలో ఐ.ఎస్.ఐ కార్యకలాపాలను నిరోధించడంలో రాష్ట్ర పోలీసులు అభినందనీయమైన పాత్ర పోషించారు. శాంతిభద్రతలను సమర్ధవంతంగా పరిరక్షించడం వల్ల, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను చిత్తశుద్ధితో అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆ 5 ఏళ్ల (1999-2004)ల్లో తీవ్రవాదుల హింస సుమారు 50% తగ్గుముఖం పట్టింది.

ఆ 5 ఏళ్లు హత్యలు, ఘర్షణలు, దోపిడీలు, దొంగతనాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

రాష్ట్రంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ముఠా కక్షలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో పోలీసుశాఖ ఆధునికీకరణకు చర్యలు చేపట్టాము. పోలీసులకు ఆధునిక ఆయుధాలను సమకూర్చడం, కమ్యూనికేషన్, రవాణా సదుపాయం, కల్పనతోపాటు పోలీసులకు శిక్షణను ఇప్పించడంలో ప్రగతి సాధించింది. పోలీసులు నైతికప్రవర్తనను పెంపొందింపజేసేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టాము.

జనాభా, పోలీసు నిష్పత్తిలో మన రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నా, శాంతి భద్రతల అదుపులో సమర్థవంతంగా వ్యవహరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో నేరాల నిష్పత్తి 1999-2004 మధ్య కేవలం 4.9 మాత్రమే ఉంది.

కంప్యూటరీకరణలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ముందంజ వేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల వరకు కంప్యూటరీకరణ పూర్తి చేశాము. ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల మంది నేరస్తుల వేలిముద్రలను భద్రపరిచాము.

రాష్ట్రంలోని 8 కేంద్రాల్లో అత్యంత ఆధునాతన ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేశాము. ఇ-కాప్స్ కార్యక్రమాన్ని తొలుత నాలుగు జిల్లాల్లో అమలు చేశాము. మిగతా జిల్లాలకు ఇ-కాప్స్ ను విస్తరించేందుకు కృషి చేశాము.

ప్రజల భాగస్వామ్యంతో మైత్రి కమిటీలు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలను భాగస్వాములను చేస్తూ పటిష్టమైన మైత్రీ కమిటీలను ఏర్పాటు చేయడం ఓ వినూత్న ప్రయోగం. మైత్రి కమిటీల ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ నిర్వహణ, వరకట్న వేధింపులు, ఇతర సమస్యల పరిష్కారం, ఫ్యామిలీ కౌన్సిలింగ్, మత ఘర్షణల అదుపు, ముఠాకక్షలు, తీవ్రవాదుల హింస, ఈవ్ టీజింగ్, రౌడీయిజం లాంటి సమస్యలకు పరిష్కారం లభించింది. ప్రజల సహకారంతో హెూంశాఖ ఎన్నో ముఖ్యమైన కేసులను దర్యాప్తు చేయగలిగింది. రాష్ట్రంలో మొత్తం 1444 పోలీస్ స్టేషన్లుంటే, 10,734 మైత్రీ కమిటీలు ఏర్పాటయ్యాయి.

సిటిజన్స్ చార్టర్

రాష్ట్రంలోని ప్రజలను మర్యాదపూర్వకంగా పలకరించి, స్వేహ పూర్వకమైన సహాయం అందించి వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా అన్ని పోలీసు స్టేషన్లలో సిటిజన్ చార్టర్లు ఏర్పాటు చేశాము. ప్రతి పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేయించి.. ఫిర్యాదు చేయడానికి ఎవరొచ్చినా వారిని కూర్చోబెట్టి వారి నుండి ఫిర్యాదులను స్వీకరించే విధానాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికి పెద్దఎత్తున ప్రజల నుండి ఆమోదం లభించింది. నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నమోదు, ప్రాసిక్యూషన్, ట్రాఫిక్ నిబంధనలు, నిర్వహణ, సహాయ చర్యలు, మానవ హక్కుల పరిరక్షణలాంటి అంశాలపై పోలీసులు అందజేసే సేవలను ఈ సిటిజన్ చార్టర్ అందించింది.

ఇ-కాప్స్ ప్రాజెక్టు

సమాచార విశ్లేషణ, సమర్థవంతమైన ప్రణాళిక, సహకారం, త్వరితగతిన నేరాలను పసిగట్టడం, ప్రాసిక్యూషన్ నిర్వహణ వంటి కీలక పనుల ద్వారా పోలీసు శాఖ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపచేయడానికి ‘ఇ-కాప్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టాము.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి) సహాయంతో పోలీసు వ్యవస్థ ఆధునికతను సంతరించుకున్న తీరు రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఇ-కాప్స్ ప్రాజెక్టు (పోలీసు సర్వీసులకు ఇ-కంప్యూటరైజ్డ్ ఆపరేషన్స్) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నెట్ వర్క్ ను అనుసంధానం చేసిన రాష్ట్రం అప్పట్లో దేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని పోలీసు స్టేషన్లను మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడింది. తగిన సమయంలో అత్యంత వేగంగా అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారాన్ని చేరవేసే ఆధునిక వ్యవస్థ ఏర్పడింది. దీంతో నేరాలను అదుపు చేయడం పోలీసులకు సులువయింది. ఆనాటి పరిమిత వనరుల దృష్ట్యా ఇ-కాప్స్ వ్యవస్థ తొలుత మూడు నగరాల్లోని 225 పోలీసు స్టేషన్లలో అమలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో 63 పోలీసు స్టేషన్లలో, విశాఖపట్నంలో 35, విజయవాడలో 29, శ్రీకాకుళం జిల్లాలో 43 పోలీసు స్టేషన్లలో, రంగారెడ్డి జిల్లాలో 55 పోలీసు స్టేషన్లలో అమలు జరిగింది. ఈ వ్యవస్థను ట్రాఫిక్ పోలీసు విభాగానికి కూడా విస్తరించడం జరిగింది.

పెర్ ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి, దాని సామర్ధ్యాన్ని, పనితనాన్ని అంచనా వేయడానికి పెర్ ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ‘ఇంటలిజెన్స్ మెసెంజర్స్’ ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలకు చెందిన పోలీసు స్టేషన్ల నుంచి రాష్ట్ర కేంద్రానికి తక్షణం డేటాను పంపే ఈ కొత్త నెట్ వర్క్ వల్ల పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలయింది.

కుటుంబ సలహా కేంద్రాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు (కుటుంబ సలహా కేంద్రాలు) ఏర్పాటు చేయించాము. వివాహ సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం కౌన్సెలింగ్ చేసేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాము. తొలుత 153 కేంద్రాలు పనిచేశాయి.

పోలీసులకు శిక్షణ – ప్రజా బంధువులుగా పోలీసులు

ప్రజలకు పోలీసులు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకొని, పోలీసు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాము. పోలీసుశాఖ బడ్జెట్ లో 2% నిధులు పోలీసుల శిక్షణకోసం వెచ్చించాము. పోలీసులకు నిరంతర శిక్షణ ఇవ్వడం మూలంగా మంచి ఫలితాలు కనిపించాయి.

శిక్షణ ప్రభావం పోలీసులను ప్రజాబంధువులుగా మార్చింది. పోలీసు అకాడమీలో 36,000 మంది ఆఫీసర్లకు శిక్షణనిచ్చాము. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో, ఇంగ్లాండ్ లోని లండన్ నగరంలో ఏవిధంగానైతే పోలీసులకు పెట్రోలింగ్ ను నిర్వహిస్తున్నారో.. ఆ తరహాలో పోలీస్ పెట్రోలింగ్ ను ‘రక్షక్’ (Rakshak) అనే పేరుతో వివిధ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రే హౌండ్స్

‘గ్రేహౌండ్స్’ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం దేశంలోనే ప్రప్రథమం. గ్రేహౌండ్స్ ఒక ప్రత్యేక కమెండో యూనిట్. గ్రే హౌండ్స్ కు గెరిల్లా ఆపరేషన్లలో, అటవీ ప్రాంతాల సంచారంలో శిక్షణనివ్వడంతోపాటు అధునాతన పరికరాలను రాష్ట్రం హెూంమంత్రిత్వశాఖ సమకూర్చింది. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైన సందర్భాల్లో మత ఘర్షణలు తలెత్తిన సమయాల్లో కూడా గ్రే హౌండ్స్ దళాలను వినియోగించడం జరిగింది. రాష్ట్రంలో వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో కూడా గ్రే హౌండ్స్ దళాలను వినియోగించాము.

స్వచ్ఛమైన న్యాయం – సత్వర పరిష్కారం

ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎ.పి.ఎఫ్.ఎస్.ఎల్.) అంతర్జాతీయ అక్రిడిటేషన్ సంపాదించిన దేశంలోని మొట్టమొదటి ఫోరెన్సిక్ లేబరేటరీ. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, గోవా రాష్ట్రాలలో జరిగిన సంచలనాత్మక కేసుల పరిష్కారానికి ఎ.పి.ఎఫ్.ఎస్.ఎల్ పరిశీలనకు పంపారు. బ్రిటన్, ఇటాలియన్ రాయబార కార్యాలయాలు కూడా తమ వద్దనున్న ముఖ్యమైన కేసులను ఎ.పి.ఎఫ్.ఎస్.ఎల్. పరిశీలనకు పంపటం జరిగింది.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్

ఐటి రంగంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి సాధించి పెద్ద పెద్ద ఐటి సంస్థలకు కేంద్రంగా నిలిచిన నేపథ్యంలో 2003 డిసెంబర్ 23న రాష్ట్రంలో ఒక సైబర్ పోలీసు స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఇన్వెస్టిగేటింగ్ అధికారులకు అధునాతన పరికరాలను సమకూర్చడం జరిగింది.

జైళ్లు

నేరస్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని జైళ్లు ప్రత్యేక చొరవను చూపడానికి జైళ్లలో పలు సదుపాయాలను కల్పించడం జరిగింది. నేరస్థులకు న్యాయం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కోర్టులు, జైళ్ల మధ్య వీడియో లింకేజి 2001 జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. కోర్టులకు జైళ్లకు మధ్య వీడియో లింకేజిని అమలులోకి తేవడం దేశంలోనే ప్రపథమం. దీంతో ఏళ్లకొద్ది విచారణకు నోచుకోకుండా జైళ్లలో మగ్గే ఖైదీల కేసులు సత్వరం పరిష్కారమయ్యాయి. వీడియో లింకేజి పథకం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లు, మండల జైళ్లు ముఖ్యమైన సబ్ జైళ్లను కూడా విస్తరించడం జరిగింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో 80 కోట్ల రూపాయలతో చర్లపల్లి, విశాఖ పట్టణాల్లో రెండు సెంట్రల్ జైళ్లను తీర్చిదిద్దాము. జైలు నుండి విడుదలైన అనంతరం ఖైదీలు.. వివిధ వృత్తులలో ప్రావీణ్యత సంపాదించి జీవనం సాగించడానికి… శిక్ష కాలంలోనే వారి అభిరుచికి అనుగుణ్యంగా అనేక వృత్తులలో శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఖైదీలకు విద్య, యోగ

జైళ్లలో ఖైదీలకు ధ్యానం, యోగ, అక్షరాస్యత కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా ఖైదీలకు ఉన్నత విద్యను అందించాము. బ్రహ్మకుమారీస్ సంస్థ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ప్రజా, అస్మిత, బాలరక్షణ సమితి వంటి అనేక స్వచ్ఛంద సంస్థలచే మహిళా ఖైదీలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది.

ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా ఉద్యమాలు – పోరాటాలు

2004-09 మధ్య కాలంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ఉపనేతగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై నేను అసెంబ్లీలో, బయట పాలకపక్షంతో అనేక సార్లు తలపడవలసి వచ్చింది. ప్రజల ప్రయోజనాల్ని ముఖ్యంగా బడుగుబలహీన వర్గాల హితాన్ని విస్మరించి ఏకపక్షంగా, వివక్షతో ఒంటెత్తుపోకడలతో నిర్ణయాలు తీసుకొంటున్న పాలక పక్షంపై రాజీలేని పోరాటాలు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులను, సమస్యలను ప్రజా మద్దతుతో అధిగమించడం జరిగింది. నా రాజకీయ జీవితంలో ఇదొక ప్రధాన అధ్యాయం. నేను చేసిన ఉద్యమాలలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసినప్పటికీ న్యాయం జరగనప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఉద్యమాలు చేయడం జరిగింది. ‘గోదావరి జల సాధన యాత్ర’ పేరిట. సాగిన పాదయాత్ర అప్పటి ప్రభుత్వంపై ఎంతో ఒత్తిడి పెంచడానికి దోహదపడింది. దానివల్ల సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతల క్రమాన్ని ప్రభుత్వం మార్చుకోవడానికి ఇతరత్రా లోపాలను సరిచేసుకోవడానికి దోహదపడింది. అలాగే, తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఎగువన అక్రమంగా గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టు కడుతున్నప్పుడు దానిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిన పరిస్థితుల్లో… మేమే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి ప్రాజెక్టును అడ్డుకొనే యత్నం చేశాం. ఆ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పోలీసుల లాఠీ దెబ్బలు చవిచూడాల్సి వచ్చింది. అరెస్ట్ లు అయ్యాం. ఆ తర్వాత ఆ అంశంపై సుదీర్ఘ పోరాటమే చేయాల్సి వచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు సమస్యలను కేంద్రం దృష్టికి, జాతీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లాం. అప్పుడు అధికారంలో ఉన్నవారిని నిద్రలేపాం. ప్రజల సాగునీటి, త్రాగునీటి కష్టాలను, ఇబ్బందులను తెలియజెప్పగలిగాం. తద్వారా… తెలంగాణలోని 7 జిల్లాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా మావంతు ప్రయత్నం, కృషి చేశాం.

ఆ తర్వాత చెప్పుకోదగ్గది – సంక్షేమ హాస్టళ్ల యాత్ర – అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు పైబడి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో.. బడుగు, బలహీన వర్గాలవారి పిల్లలు నివాసం ఉండే సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు తగిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వానికి ప్రాధాన్యతలు తెలియజెప్పి పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి.. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. శిథిలావస్థకు చేరిన సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు, మరుగు దొడ్లకు నోచని హాస్టళ్లల్లోని విద్యార్థులు.. బహిర్భూమికి వెళితే అక్కడ పాముకాట్లకు, తేళ్ల కాట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక సంఘటనల్ని సభ్యసమాజానికి తెలియజెప్పాము. సమాజ సంపద సృష్టికర్తలైనప్పటికీ.. దేశంలో అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల పేదలుగా మిగిలిపోయిన పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లలో పడుతున్న కడగండ్లను సభ్య సమాజం దృష్టికి తెచ్చేందుకు, అలాగే ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు ‘సంక్షేమ హాస్టళ్ల’లో అక్కడి విద్యార్థులతో కలిసి కటికనేలపై నిద్రించాము. హాస్టళ్ల విద్యార్థుల్లో మనో ధైర్యం నింపాం.

ఇక.. నిలువనీడ, గూడు లేని పేదలకు కనీసం 60 గజాల స్థలం కేటాయించకుండా.. సెజ్ పేరుతో, పారిశ్రామిక కారిడార్ల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను పాలకపక్షం ఇష్టానుసారం సంతర్పణ కావిస్తుంటే.. ప్రభుత్వ చర్యలను నిలదీశాము, ఎండగట్టాము. ప్రజలకు వాస్తవిక పరిస్థితులను వివరించాము. పేదల కాలనీలకు వెళ్లి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్యమించాం. పేదల బాధల్ని, సమస్యల్ని నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రజలకు సహజన్యాయం జరిగేందుకు కృషి చేయడం జరిగింది.

గోదావరి జలసాధన యాత్ర

2004లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో తొలుత 26 భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్ లో దాదాపు 50% నిధులను సాగునీటి రంగంపై ఖర్చు చేయడానికి ప్రతిపాదించారు. అయితే, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చే భారీ ప్రాజెక్టులు అందులో లేవు. తెలంగాణ ప్రాంత మధ్యతరహా ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులు కేటాయించారు. పైగా, తెలంగాణ ప్రాంతంలో ఉపయోగించాల్సిన జలాలను వేరే ప్రాంతాలకు మళ్లించడానికి సంకల్పించారు. జలయజ్ఞం పేరుతో నిధులు, నీళ్ల దోపిడీకి రంగం సిద్ధమైన సమయంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా, తెలంగాణ ప్రతినిధిగా ఈ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను నేను స్వీకరించాను. తెలంగాణకు కూడా మిగతా ప్రాంతాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పర్చాలని, ముఖ్యంగా తెలంగాణాలో సాగునీటి రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని అప్పటి ముఖ్యమంత్రిని పలు వేదికల నుంచి కోరడం జరిగింది. గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (స్టీజి-2), ఎల్లంపల్లి, దేవాదుల ఎత్తిపోతల, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులను చేపట్టినట్లయితే దాదాపు 120 టీఎంసీల జలాలు అందుబాటులోకి వచ్చి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సాగునీరు, త్రాగునీరు అందించగలగడమే కాకుండా జంట నగరాలకు త్రాగునీరు అందించే అవకాశం లభిస్తుందని, తెలంగాణలో శాశ్వతంగా కరువు నివారణ జరుగుతుందని అసెంబ్లీలో, బయట అనేక వేదికల ద్వారా తెలియజేయడం జరిగింది.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుగా చేపట్టాలని, దేవాదులను పూర్తి సామర్థ్యంతో చేపట్టాలని డిమాండ్ చేశాము. స్థానిక అవసరాలు తీరిన తర్వాతనే మిగిలిన జలాలను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న న్యాయమైన కోరికను ప్రభుత్వానికి నివేదించాము. అయినప్పటికీ.. ప్రభుత్వ వైఖరిలో మార్పురాలేదు. అనేక సాకులు, సాంకేతిక కారణాలు చూపి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని తేల్చేసింది. అయితే, అదే సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా సాధ్యమో తెలియజేస్తూ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, హైదరాబాద్’ ఒక సమగ్ర నివేదికను రూపొందించి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి సవివరంగా తెలియజేశారు. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. వారు అందించిన నివేదికను అందరూ చదివి వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా నేనే చొరవ తీసుకొని దానిని ఒక పుస్తకంగా ప్రచురించి శాసనసభ్యులందరికీ పంపించాను. అసెంబ్లీలో ఆ అంశాన్ని ప్రత్యేకంగా చర్చకు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాన్ని అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి అందజేశాం.

ప్రతిపక్ష నేతగా, వెనుకబడిన తెలంగాణా ప్రాంత ప్రతినిధిగా జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించలేకపోయాను. నిజానికి, తెలంగాణలో ప్రతీది పోరాటాల ద్వారానే సమకూరాయి. ఏదీ అయాచితంగా రాలేదు. తెలంగాణా ప్రజల పక్షాన నిలబడి పోరాడితే తప్ప ప్రభుత్వం దిగిరాదని తేలిపోవడంతో.. పార్టీ సహచరులతో, నాయకత్వంతో చర్చించి ‘గోదావరి జలసాధన యాత్ర’ పేరుతో ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నాము. అందుకు సహచర నాయకులందరూ నాకు మద్దతు తెలిపారు. ఈ ఉద్యమం ప్రారంభించడానికి ఎంతో కసరత్తు చేశాము. జిల్లా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం జరిగింది. జిల్లాలవారీగా కలెక్టరేట్ల ముందు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాము. తెలంగాణకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని చివరి క్షణం వరకు ఒప్పించడానికి ప్రయత్నించాము. కానీ, ప్రభుత్వ వైఖరిలో మార్పురాలేదు. ప్రభుత్వ మొండివైఖరితో విసిగి ఇక ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఉద్దేశంతో జనవరి 28, 2006న ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల సమీపంలోని పాలవాగు నుంచి గోదావరి జలసాధన యాత్ర మొదలైంది. 24 రోజుల పాటు ఏకబిగిన 8 జిల్లాల్లో సుమారు 500 కి.మీ పాటు ఈ పాదయాత్ర సాగింది. అప్పటి ప్రభుత్వం ఈ ఉద్యమానికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించింది. అస్థిత్వం కోసం చేస్తున్న ఉద్యమంగా చిత్రీకరించింది. రాజకీయ రాద్ధాంతంగా అభివర్ణించింది. మేము ఉద్యమం ప్రారంభించిన ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు శుద్ధి యాత్ర నిర్వహించారు. మా దిష్టిబొమ్మలు కాల్చారు. జలయజ్ఞాన్ని అడ్డుకుంటున్న దుర్మార్గులమని నిందించారు. వారి వెనకనే ప్రాణహిత నీళ్లు వచ్చేస్తున్నాయంటూ నమ్మబలికారు.

నేను చేసిన పాదయాత్రలో తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల తెలుగుదేశంపార్టీ నేతలు నాతోపాటు పాల్గొన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో మద్దతు తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఈ యాత్రలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ ప్రజల మద్దతుతో వాటిని అధిగమించాము. ‘గోదావరి జలసాధన యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేయగలిగాము. తెలంగాణ చరిత్రలో.. ఈ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టకుండా గోదావరి జలాలను తరలించుకువెళ్లాలన్న అప్పటి ప్రభుత్వ ప్రయత్నానికి గండిపడింది. ప్రాంతాల మధ్య అసమానతలను ప్రభుత్వం ఏవిధంగా పెంచి పోషిస్తున్నదో ప్రజలకు అర్ధం అయింది. ప్రభుత్వ వివక్ష వల్ల అప్పటికే బలపడుతున్న తెలంగాణవాదంలో.. ‘నదీజలాలపై ప్రజల హక్కులు అన్నది’ అంతర్భాగమైంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ చైతన్యంతో సంఘటితమై తమ హక్కుల కోసం ఉద్యమించేందుకు గోదావరి జలసాధన యాత్ర నాంది ప్రస్తావనగా ఉపయోగపడింది.

మా కృషి ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపడతామని ప్రకటించింది. అయితే, తదనంతర పరిణామాలలో.. అధికారంలో ఉన్నవారు ఆ ప్రాజెక్టును ఒక అవినీతి వనరుగా ఉపయోగించుకున్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కడగండ్లను తీర్చాలనే చిత్తశుద్ధిని చూపలేదు. ప్రాజెక్టును ప్యాకేజీలుగా విడగొట్టి క్రాంటాక్టర్లకు అప్పజెప్పి మొబిలైజేషన్ అడ్వాన్సులు అప్పజెప్పారు. హెడ్ వర్క్స్ చేపట్టకుండానే కాలువలు తవ్వారు. ఆ విధంగా ఆ ప్రాజెక్టులో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 10 వేల కోట్ల అంచానాతో మొదలై.. ఆ తర్వాత 32 వేల కోట్లకు చేరింది. కాగా, ప్రజల అవసరాలకోసం ఉపయోగపడాల్సిన ప్రాజెక్టు అధికార పార్టీ నేతల ఎన్నికల అవసరాలకు సొమ్ము సమకూర్చే కాంట్రాక్టర్ల పరమై ఎటువంటి పురోగతి లేకుండా నిలిచిపోయింది.

‘బాబ్లీ’ ఉద్యమం

తెలంగాణ చరిత్రలో బాబ్లీ ఉద్యమం ఒక ప్రధాన అధ్యాయం. తెలంగాణ ప్రాంతంలో ప్రధాన ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు గర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వం… దొంగచాటుగా, నియమ నిబంధనలకు విరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 2005 మే లో ఈ అక్రమ కట్టడం ఉదంతాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తెలుగుదేశం పార్టీ తరపున మేము తీసుకువెళ్లాము. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న నేను బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వానికి వివరించాను. నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులకు సంబంధించిన ఫోటోలను స్పీకర్ కు, ప్రభుత్వానికి అందించాను. అయిన్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. మహారాష్ట్ర నిర్మిస్తున్నది చెక్ డ్యామ్ మాత్రమేనని ఒక టిఎంసీ సామర్థ్యం నీళ్లు కూడా పోవని కొందరు వాదించారు. అయితే, తెలుగుదేశం శాసనసభాపక్షం తరపున నాతోపాటు తెలంగాణ నేతలందరం బాబ్లీని సందర్శించాము. తిరిగొచ్చాక అక్కడి పరిస్థితులపై ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాము. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఆ తర్వాత పార్లమెంట్ లో ఈ అంశాన్ని తెలుగుదేశం ఎంపీలు లేవనెత్తడం జరిగింది. తదనంతర పరిణామాల్లో ప్రధానిని అఖిలపక్షంగా మేమంతా ఇతర పార్టీలతో కలిసి వినతి పత్రం ఇచ్చాము. తెలుగుదేశం శాసనసభాపక్షం బాబ్లీని సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా.. మహారాష్ట్ర పోలీసులు అనుచితంగా వ్యవహరించి విచక్షణారహితంగా జరిపిన లాఠీ చార్జిలో అనేకమంది నాయకులు గాయపడ్డారు. దానిపై తెలంగాణలోని 7 జిల్లాలు భగ్గుమన్నాయి. ప్రజాగ్రహం పెల్లుబికింది. ఎస్సారెస్పీ ఆయకట్టును పరిరక్షించుకోవాలన్న ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తం అయింది.

బడుగువర్గాల సంక్షేమ యాత్ర

సంక్షేమ రాజ్యస్థాపన ప్రభుత్వాల లక్ష్యం కావాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేదలు, బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక అంతరాలు, అసమానతలు తగ్గుతాయి. ముఖ్యంగా సమాజ సంపద సృష్టిలో భాగస్వాములుగా ఉన్న కార్మికులు, పేదల పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలి. తరతరాలుగా ఈ వర్గాల వారు విద్యకు దూరమవుతున్నారు. చదువుకుంటున్న కొద్ది శాతం మంది పట్ల కొన్ని ప్రభుత్వాలు చూపుతున్న ఉదాసీనత, కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల చాలా మంది విద్యకు దూరమవుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఒకప్పుడు పేదలు, బడుగు బలహీనవర్గాల వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దిన సంక్షేమ వసతి గృహాలు రానురాను నిధుల సమస్యతో ఇతరత్రా కారణాలతో మురికి కూపాలుగా మారిపోయాయి.

ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారిపోయి ఆర్థికాభివృద్ధి పేరుతో పరిశ్రమలకు వేలకోట్ల రూపాయల రాయితీలు, వసతులు కల్పిస్తూ.. సంక్షేమ హాస్టళ్ల బడ్జెట్ ను తగ్గించడం ఆనవాయితీగా మారింది. పేరుకే సంక్షేమం తప్ప ఆ వసతి గృహాల్లోని పిల్లలకు సరియైన ఆహారం, ఇతర సదుపాయాలు లేకపోవటం అన్నది పరిపాటిగా మారింది. వందలాది మంది విద్యార్థినులు నాలుగే నాలుగు మరుగుదొడ్లలో సరిపెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల స్నానం చేయడానికి నీళ్లు లేక… విద్యార్థులు చెరువులు, కుంటలకు వెళ్లి అందులో దిగి ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సంఘటనలు జరిగాయి.

సంక్షేమ హాస్టళ్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి.. సంక్షేమ హాస్టళ్ల వసతులను మెరుగుపర్చడానికై.. 2004-09 మధ్య కాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉపనేతగా ఉన్న నేను చేసిన ‘సంక్షేమ హాస్టళ్ల యాత్ర..’ రాష్ట్రంలో పెను దుమారం రేపింది. హాస్టళ్ల విద్యార్థులతోపాటు నిద్రపోవడం, అక్కడి సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. దాంతో, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీశాయి. హైకోర్టు, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలు స్పందించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లను సందర్శించినప్పుడు అనేక దారుణ పరిస్థితులు కన్పించాయి. ప్రతి హాస్టల్ లో పారిశుద్ధ్యలేమి, దుర్గంధ వాతావరణం. వసతి గృహాల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగినపుడు విద్యార్థులు చెప్పిన విషయాలు మనసును కలచివేశాయి. ఉడికీఉడకని అన్నం తింటున్నారు. సాన్నం చేయడానికి, దుస్తులు ఉతుక్కోవడానికి నీళ్లు రావు. కనీస వైద్య సదుపాయాలు లేక రోగాలపాలై కొందరు మృత్యువాత పడ్డారని తెలిసింది. కాళ్లు చాపుకోవడానికి కూడా స్థలం లేని ఇరుకు గదిలో పదుల సంఖ్యలో నిద్రిస్తున్న అభాగ్యులు కనిపించారు. హాస్టళ్లలోనే రాత్రి వేళల్లో పడుకొన్నాం. విద్యార్థులకు మనోధైర్యం కల్పించాం.

పేదల ఇళ్ల స్థలాలకై పోరాటం

సృష్టిలోని ప్రతి మనిషికి అనుభూతులు, అవసరాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రకృతి ధర్మాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సూర్యోదయంతో పనులకు ఉపక్రమించి సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడానికి గూడుకు చేరుకుంటారు. అయితే, తరతరాలుగా భారత సమాజంలో వ్రేళ్లూనుకొని పోయిన ఆర్థిక, సామాజిక అంతరాలు కారణంగా కొద్దిమంది వద్ద మితిమీరిన సంపద పోగు పడగా, కోట్లాది మందికి కనీసం తలదాచుకోవడానికి ఇంత స్థలం దొరికే పరిస్థితి లేదు. కొన్ని ప్రభుత్వాలు స్వార్థంతో, అవినీతితో కొందరికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తూ.. పేదలకు 60 గజాల జాగాలను కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల గూడులేని పేద కుటుంబాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది.

ఇంకోపక్క ఆర్థిక సంస్కరణల పేరుతో పారిశ్రామికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఎకరాలను పేరు, ఊరు లేని సంస్థలకు కట్టబెడుతూ.. పేదలు నివసిస్తున్న స్థలాల్లోని గుడిసెలను బలవంతంగా కూలదోస్తున్నారు. వారిని రోడ్డున పడేస్తున్నారు. సామాజిక అశాంతి ఏర్పడుతున్నది. 2004లో ప్రధాన ప్రతిపక్ష ఉపనాయకుడిగా ఉన్న నేను ప్రభుత్వ విధానాలను దుయ్య బడుతూ.. పేదల పక్షాన నిలబడి వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ పై ఉద్యమించడం జరిగింది. ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించే దుర్మార్గాన్ని ప్రశ్నించాము. చట్టంలో మార్పు తెచ్చి ఇంటి జాగా పొందటం అన్నది ప్రతిఒక్కరికి జన్మహక్కుగా సంక్రమించే రోజు రావాలన్నది నా ఆశయం.

వ్యవసాయ మద్దతు ధరలపై ఉద్యమం

వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పులపాలై పెద్దఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో.. రైతులకు అండగా నిలబడి వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాగించిన ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఈ సమస్య తీవ్రతను తెలియజేయడానికి అసెంబ్లీలో ఆనాడు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ధర్నా చేపట్టింది. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగా రైతులకు చాలావరకు న్యాయం జరిగింది.

ప్రజాభీష్టానికి అనుగుణంగా కఠిన నిర్ణయాలు

రాజకీయాలెప్పుడూ యథాతథస్థితిలో ఉండవన్నది ఓ కఠోర వాస్తవం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలు నిత్యం మారుతూ ఉంటాయి. నిజానికి, అన్ని వ్యవస్థలు ప్రజల అవసరాలను తీర్చడానికి తమనుతాము తీర్చిదిద్దుకోవాలి. రాజకీయ వ్యవస్థ సైతం ఈ అంశాన్ని అనివార్యంగా గుర్తించాలి, గౌరవించాలి, తదనుగుణంగా మార్పులు చేసుకోవాలి. మొదట్నుంచీ నేను చెబుతున్నది కూడా ఇదే! ప్రజల మనోభావాలను గుర్తెరిగి, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయడం అలవాటు చేసుకున్న నేను నా రాజకీయ జీవితంలో… కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏనాడు వ్యక్తిగత లాభనష్టాలను బేరీజు వేసుకోలేదు.

‘గోదావరి జలసాధన యాత్ర’ సందర్భంగా అనేక గ్రామాలు పర్యటించినపుడు.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి మనోభావాలు నాకు అర్థమయ్యాయి. తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడాలన్న బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉండటం నేను గమనించాను. నిజానికి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, దానివల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఈ విషయాన్ని పార్టీ వేదికపైన ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. భౌగోళికంగా తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి, అన్నదమ్ముల్లా సహకరించుకుంటే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తారని చెప్పాను. ప్రజలు కోరుకున్నదీ, ఇప్పుడు జరుగుతున్నదీ అదే! రాజకీయాల్లోకి యువత రావాలని, అన్ని స్థాయిల్లో నూతన నాయకత్వం రాగలిగితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వారు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తారని ఆశించాను. రాజకీయ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావాలని, ప్రజాస్వామిక వ్యవస్థ నిండుదనంతో పనిచేయాలని భావించాను. ఈ ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెట్టాలని నాలో బలంగా ఉండేది. ఆ నేపథ్యంలోనే ఆనాటి పరిస్థితులు, ప్రజల అభీష్టం మేరకే ‘నవతెలంగాణ పార్టీ’ ని స్థాపించడం జరిగింది. నవతెలంగాణ పార్టీ ఏర్పాటు చేశాక ‘తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర’ చేపట్టి తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించడం జరిగింది. ఆ సమయంలో నాకు అనేక అంశాలు గమనంలోకి వచ్చాయి. మంత్రిగా పలు బాధ్యతలలో తలమునకలుగా ఉన్నప్పుడు కంటే ఎక్కువ విషయాలు ఆ సమయంలో నాకు క్షుణ్ణంగా తెలుసుకొనే అవకాశం లభించింది. పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల ముఖ్యనేతలను, శ్రీమతి సోనియాగాంధీ గారిని, అద్వానీ గారిని, మిగతా ముఖ్యనేతలను కలుసుకొని ఇక్కడి పరిస్థితులను వారికి వివరించి తెలంగాణ ఏర్పాటునకు సహకరించమని కోరడం జరిగింది. కొంతకాలానికే ప్రముఖ సినీనటులు శ్రీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడం, యువతలో కొత్త ఆశలు చిగురించడం గమనించాను. యువతకు పుష్కలంగా అవకాశాలు వస్తాయన్న అంచనా వేయడంతో ‘నవతెలంగాణ’ను ‘ప్రజారాజ్యం’లోకి విలీనం చేయడం జరిగింది. ఇదంతా ప్రజల సంక్షేమం; భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థ మంచివారితో ముందుకు సాగాలనే సదుద్దేశంతోనే చేయడం జరిగింది. అయితే, కొన్నిసార్లు మనం అన్నీ అనుకున్నట్లు జరగవు. కారణాలు ఏవైనా నేను ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే, తెలంగాణవాదం బలపడటానికి, అంతిమంగా తెలంగాణ ఏర్పడటానికి నేను తీసుకున్న నిర్ణయాలు చాలా దోహదపడ్డాయి.

ప్రత్యేక రాష్ట్రంగా ‘తెలంగాణ’ ఏర్పాటు కొరకు ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి తాత్సారం జరుగుతున్న సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నవ తెలంగాణ పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ నేతృత్వంలోని బృందం 10- జన్ పథ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీతో భేటీ అయింది. ఆ సందర్భంగా దేవేందర్ గౌడ్ దాదాపు 30 ని||ల పాటు శ్రీమతి సోనియా గాంధీకి 1953 నుండి జరిగిన చరిత్ర క్రమాన్ని వివరించి ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజెప్పారు. “సరైన సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని మీరు చెప్పారు. దానికి ఇంతకంటే సరైన సమయం ఉండదు. అన్ని పార్టీలు తెలంగాణను కోరుకుంటున్నాయి. బిల్లు పెట్టండి మద్దతు ఇస్తామంటున్నాయి. మీరే చొరవ చూపాలి” అని దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

రాజ్యసభ సభ్యునిగా..

నా రాజకీయ జీవితంలో రాజ్యసభ సభ్యునిగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం ఓ ప్రధాన అధ్యాయం. 2012లో నేను రాజ్యసభకు ఎంపికయ్యాను. ఆ సమయంలో.. తెలంగాణ మలిదళ ఉద్యమం తీవ్రంగా ఉంది. ఆ నేపథ్యంలో నేను.. రాజ్యసభను వేదికగా చేసుకొని ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సమగ్రంగా అన్ని విషయాలను ప్రస్తావించాను. ఒకవిధంగా చెప్పాలంటే.. తెలంగాణ సమస్యను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించగలిగానని భావిస్తాను. తెలంగాణపై జాతీయస్థాయిలో దాదాపుగా ఏకాభిప్రాయం రావడానికి నా ప్రసంగం నాంది పలకడం నాకు సంతృప్తిని కలిగించే అంశాలలో ఒకటి. రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన 6 సంవత్సరాలలో నాకు అనేక మంది జాతీయ పార్టీల నేతలు మరియు ప్రాంతీయ పార్టీ నేతలతో చక్కటి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. వారితో దేశానికి సంబంధించిన అనేక అంశాలపై పరస్పరం చర్చించుకోవడం నాకు మరిచిపోలేని స్మృతులు.

రాజ్యసభ సభ్యునిగా నాకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పర్చుకొన్నాను. ముఖ్యంగా.. రక్షణ, రైల్వే ఓబీసీ,
ఎథిక్స్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి మొదలైన కీలక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉండి దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి అక్కడి స్థితిగతులను, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశం లభించింది. ఓబీసీ కమిటీకి సభ్యుడిగా నేను చేసిన సూచనల్లో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా.. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి నా వంతు కృషి చేశాను. నాకు కేటాయించిన నిధులను పూర్తిగా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాను.

తెలుగుదేశం సంస్థాగత వ్యవహారాలలో ప్రధాన భూమిక

నిర్దిష్టమైన సిద్ధాంతాలతో, విధానాలతో ప్రాంతీయ పార్టీగా స్వర్గీయ ఎన్.టి. రామారావు స్థాపించిన ‘తెలుగుదేశం’.. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తోంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి దిశ, దశను నిర్ణయించే బాధ్యతను పార్టీ రాజ్యాంగం.. ‘పోలిట్ బ్యూరో’కు అప్పగించింది. పార్టీలోగానీ, ప్రభుత్వంలో ఉన్నప్పుడు గానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ముందుగా పోలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత, సభ్యులందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీ. వేలాదిమంది నాయకులు ఉన్న పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయాలను తీసుకొనే ‘పోలిట్ బ్యూరో’ లో స్థానం లభించడం ఓ గొప్ప అవకాశం. అటువంటి అవకాశం నాకు 1992లోనే దక్కింది.

చిన్న వయస్సులోనే పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యునిగా పని చేయడానికి వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగాను. ముఖ్యంగా.. పేద, అణగారిన ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు లభించిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేయగలిగాను. పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరగడానికి నావంతు కృషి చేశాను. జాతీయ స్థాయిలోగానీ, రాష్ట్ర స్థాయిలోగానీ ‘తెలుగుదేశం’ నిర్వహించాల్సిన పాత్రను నిర్ణయించడంలో నా అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేవాణ్ణి. శ్రీ నారా చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా నాకు పోలిట్ బ్యూరోలో సభ్యునిగా కొనసాగే అవకాశం లభించింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రూపొందించాల్సిన పథకాలను ముందుగా పార్టీలో చర్చించి ప్రభుత్వానికి నివేదించే సంప్రదాయాన్ని తెలుగుదేశం మొదట్నుంచి కొనసాగిస్తోంది. వివిధ వర్గాల ప్రజల ఇబ్బందులను, ఈతి బాధలను దృష్టిలో పెట్టుకొని, ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకొని ఆయా వర్గాలకు వీలైనంత ఎక్కువగా మేలు చేసే కార్యక్రమాల రూపకల్పనకు పార్టీపరంగా సూచనలు, సలహాలు, మార్గదర్శకం చేసే అవకాశాన్ని నేనెప్పుడూ వదులుకోలేదు. కొన్ని సందర్భాలలో పార్టీ భిన్నమైన విధానం తీసుకున్నప్పటికీ.. ప్రజల ఆకాంక్షలను తెలియపర్చడంలో నా బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు.

పార్టీ ప్రతినిధులు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యే మహానాడులో ప్రజా సమస్యలను, పార్టీ వ్యవహారాలను చర్చించడం జరుగుతుంది. ముసాయిదా తీర్మానాలను ఆమోదించిన తర్వాత వాటిని ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఆ తీర్మానాలే ప్రభుత్వ విధానాల రూపంలో అమలు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా నేను ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాను. ముసాయిదా తీర్మానాల రూపకల్పన, వాటిని ప్రవేశపెట్టడం, ఆమోదించడం మొదలైన పార్టీ అంతర్గత వ్యవహారాలలో పార్టీ అధ్యక్షుడికి చేదోడువాదోడుగా నిలిచి… పార్టీ సంస్థాగత వ్యవహారాలలో ప్రధాన భూమికను పోషించాను. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేశాను.

దేశ, విదేశీ నేతలతో.. ప్రముఖులతో

నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికారికంగా వివిధ దేశాలు పర్యటించే అవకాశం లభించింది. అధికారిక పర్యటనలతోపాటు, కొన్ని సందర్భాల్లో పలు దేశాలను వ్యక్తిగత హెూదాలో పర్యటించడం జరిగింది. ఎవరైనా, తమ విదేశీ పర్యటనల్లో ఎక్కువ భాగం చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించడానికి ఉత్సాహం చూపడం సర్వసాధారణం. అయితే, నాకు చిన్నతనం నుంచి ఆయా దేశాల భౌగోళిక, చారిత్రక పరిస్థితులతోపాటు అక్కడి పాలనా వ్యవస్థలు పనిచేసే తీరును తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ప్రపంచంలో దాదాపు 3 వేల సంవత్సరాలపాటు కొనసాగిన రాచరికాలు కుప్పకూలడం, సైనిక నియంతృత్వాలు అంతం కావడం, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వ్యవస్థలు ప్రజాగ్రహానికి గురికావడం మొదలైన రాజకీయ, సామాజిక మార్పులు ఏవిధంగా చోటుచేసుకున్నాయో పుస్తకాల ద్వారా ఇతరత్రా మార్గాల ద్వారా తెలుసుకున్నప్పటికీ.. స్వయంగా వెళ్లి పరిశీలించే అవకాశం లభిస్తే బాగుంటుందని అనుకునేవాణ్ణి. అటువంటి అవకాశం యాదృచ్ఛికంగా లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అధికార పర్యటనల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పర్యాటక స్థలాలతోపాటు ఆ ప్రాంతంలోని పాలనా వ్యవస్థలు ఏవిధంగా పని చేస్తున్నాయో, సామాజిక స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఆ పర్యటనలు నాకు ఉపయోగపడ్డాయి.

నేను రాష్ట్ర హెూంమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలోని ప్రధాన నగరమైన న్యూయార్క్ ను సందర్శించాను. అతిపెద్ద వాణిజ్య నగరమైన న్యూయార్క్ సహజంగానే శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉంటుంది. ఇంత పెద్ద నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి అక్కడి పోలీసు యంత్రాంగం ఏవిధంగా పనిచేస్తున్నది? వారు ఉపయోగిస్తున్న పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల భాగస్వామ్యం వంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నాను. న్యూయార్క్ పోలీస్ చీఫ్ ను కలుసుకున్నప్పుడు అక్కడి ‘పోలీసింగ్’ లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని దీటుగా ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు వారు చేపడుతున్నటువంటి చర్యలు, తదితర విషయాలను చర్చించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది అక్కడి జైళ్ల వ్యవస్థ. నేరస్థుల్లో పరివర్తన తేవడానికి, జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు.. విడుదల అనంతరం సాధారణ జీవితం గడపడానికి అవసరమైన వివిధ వృత్తులలో వారికి శిక్షణ అందించడం నన్ను ఆకర్షించింది. ఇంకా అక్కడ అమలు జరుగుతున్న పలు సంస్కరణలు ఆకట్టుకున్నాయి. లండన్ లో పర్యటించినప్పుడు కూడా బ్రిటీష్ పోలీస్, స్కాట్ ల్యాండ్
పోలీస్ వ్యవస్థల పనితీరును పరిశీలించడం జరిగింది. పూర్తిగా కాకపోయినా, చాలా వరకు మన పోలీసు శాఖలో, జైళ్ల వ్యవస్థలో ఆ తరహా విధానాలు అమలు జరగడానికి నావంతు కృషి చేశాను.

నేను జరిపిన విదేశీ పర్యటనల్లో ‘పీపుల్స్ రిపబ్లిక్ చైనా’ సందర్శన ప్రత్యేకమైనది. 2000 సంవత్సరంలో చైనా నుంచి వచ్చిన అధికారిక ఆహ్వానం మేరకు అక్కడి రాజకీయ, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ బృందానికి నేను నేతృత్వం వహించాను. ఇప్పుడంటే చైనాకు సంబంధించిన అనేక విశేషాలు మనకు తెలుస్తున్నాయి. కానీ, ఆనాటికి.. చైనా ఎవరికీ అర్థం కాని ఓ బ్రహ్మ పదార్థం. అతిపెద్ద దేశమైన చైనా.. ఇంచుమించుగా మనతోపాటు ఒకేసారి స్వతంత్రం సాధించుకుంది. వారసత్వంగా అనేక సమస్యలతో ముఖ్యంగా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమైన చైనా స్వల్పకాలంలోనే ఏవిధంగా ఆర్థికంగా పురోగమించింది? ఇతర దేశాల సహాయ సహకారాలు లేకుండా.. సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వృద్ధి పర్చుకొని నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు మొదలైన రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని ఏవిధంగా సాకారం చేయగలిగింది? ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఏవిధంగా అవతరించింది? అందుకు దోహదం చేసిన అంశాలేమిటి? మొదలైన వాటిని తెలుసుకోవాలన్న ఉత్సుకత నాలో ఎంతో ఉండేది. 15 రోజులపాటు చైనాలో మేము చేసిన పర్యటనలో అనేక అబ్బురపరిచే సంఘటనలను, సన్నివేశాలను చూడటం జరిగింది. క్షణం వృధా చేయకుండా అక్కడి ప్రజలు కష్టపడుతున్న తీరు, పనిపట్ల శ్రద్ధ, ఎనలేని దేశభక్తి మొదలైన వాటిని గ్రహించగలిగాను. బీజింగ్ తో పాటు అనేక నగరాలను సందర్శించాము. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూసినపుడు కలిగిన అనుభూతి, స్వేచ్ఛ కోసం కాలేజీ విద్యార్థులు ఉద్యమించి ప్రాణాలర్పించిన తియాన్ మన్ స్క్వేర్ ను సందర్శించినపుడు కలిగిన ఉద్వేగాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా, ఆధునిక చైనా వైతాళికుడిగా పేర్కొనదగ్గ ‘మావో’ యొక్క భౌతిక కాయాన్ని భద్రపర్చిన మ్యూజియంను సందర్శించి ఆ మహానేతకు అంజలి ఘటించడం మర్చిపోలేని అనుభూతి. ఆ విధంగా చైనా పర్యటనలో అనేక అనుభవాలు కలిగాయి. వివిధ స్థాయిల నేతలతో జరిపిన చర్చలు, సమావేశాల సందర్భంగా అక్కడి వ్యవస్థల పనితీరుపై అవగాహన కలిగింది. చైనాలో జరిపిన 15 రోజుల పర్యటన నా జీవితంలో ఓ అరుదైన అనుభూతి, అనుభవంగా మిగిలిపోయింది.

హైదరాబాద్ లో ‘జాతీయ క్రీడలు’ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ కు అవకాశం లభించినపుడు, క్రీడల నిర్వహణ కమిటీకి నన్ను అధ్యక్షుడిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు నియమించారు. అప్పుడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఆసియా క్రీడలు జరుగుతుండటంతో.. ఆ క్రీడల నిర్వహణను అధ్యయనం చేయడానికి సియోల్ వెళ్లాను. ఆ సందర్భంలోనే మలేషియా, థాయిలాండ్, సింగపూర్, హాంకాంగ్, జపాన్ మొదలగు దేశాల్లో పర్యటించాను. అక్కడి అధునాతన రవాణా, మౌలిక సదుపాయాలను తెలుసుకోగలిగాను. వ్యక్తిగత పర్యటనలలో భాగంగా నేను ఎక్కువగా యూరప్ దేశాలలో పర్యటించాను. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం.. ఇంచుమించుగా అన్ని దేశాలు వెళ్లాను. ప్రపంచ నాగరికతకు, అభివృద్ధికి దోహదం చేసిన ఫ్రెంచి విప్లవం మొదలుకొని అనేక అంశాలను చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న నేను… స్వయంగా అక్కడి అభివృద్ధిని, సంస్కృతిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది.

పది ఏళ్లపాటు, 1994 నుండి 2004 వరకూ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న నాకు.. ప్రపంచంలోని అనేక దేశాల నుండి హైదరాబాద్ కు అధికారిక పర్యటనల నిమిత్తం వచ్చిన విదేశీ ప్రముఖులను కలుసుకొని వారితో వివిధ అంశాలు చర్చించే అవకాశం లభించింది. ఆయా నాయకులతో పరస్పరం అనేక విషయాలను, అనుభవాలను పంచుకోవడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన ప్రముఖుల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోని బ్లేయర్, చైనా ప్రీమియర్, సింగపూర్ ప్రధాని ఇంకా అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోరే తదితరులను కలుసుకునే అవకాశం లభించింది.

నా అధికారిక విధుల్లో భాగంగా విదేశీ ప్రముఖులతోపాటు దేశ ప్రముఖులను కూడా అధికారిక సమావేశాలలో కలుసుకోవడం, ఆయా అంశాలపై చర్చించడం జరిగేవి. పలు రంగాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తులను కలుసుకోవడం, వారి అనుభవాలను తెలుసుకోవడం వెలకట్టలేని జ్ఞాన సంపద. ఆ అనుభవం నాకు ఇక్కడి పరిపాలనా రంగంలో మెరుగైన మార్పులు, నిర్ణయాలు చేయడానికి, ప్రపంచంలోని వివిధ వ్యవస్థలను శాస్త్రీయ దృక్పధంతో అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడింది.

సామాజిక కార్యక్రమాలలో మమేకం

వ్యక్తిగతంగా నాకు ఎక్కువ సంతృప్తినిచ్చినవి సామాజిక కార్యక్రమాలే. మొదట్నుంచీ సామాజిక కార్యక్రమాలపై నాకు ఆసక్తి ఎక్కువ. మేము మా చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందులు.. ముఖ్యంగా, చదువుకోవడానికి మా తుక్కుగూడ గ్రామంలో ఉన్నత పాఠశాల లేకపోవడం వల్ల మేము నాల్గవ తరగతి చదువుకోవడానికి గ్రామం విడిచి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో… ‘దేవేంద్ర ఫౌండేషన్’ అనే స్వచ్చంద సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుక్కుగూడలో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఒక స్కూల్ ను ఏర్పాటుచేసి విజయవంతంగా గత దశాబ్దకాలానికి పైగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రస్తుతం దేవేంద్ర స్కూల్ లో దాదాపు 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో 3వ వంతు విద్యార్థులకు ఉచితంగా విద్యతోపాటు పుస్తకాలు, దుస్తులు, స్కాలర్ షిప్ లు మొదలైనవి కల్పించడం జరుగుతున్నది. నేను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు.. మా తుక్కుగూడలో రెసిడెన్షియల్ హాస్టల్ ను ఏర్పాటు చేయడానికి.. నా సొంత ఆస్థి నుంచి 10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలోనే రెసిడెన్షియల్ హాస్టల్ నిర్మాణం జరిగింది. పేదరికాన్ని, పేదరికం వల్ల ఉత్పన్నమయ్యే అనేక సమస్యలకు పరిష్కారం విద్య మాత్రమే అని నమ్మే నేను మా గ్రామంలో హాస్టల్ ఏర్పాటు చేయించడానికి విలువైన భూమిని అందించి దాని ద్వారా ప్రతియేటా వందలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి దోహదం చేయడం నాకు ఎంతో తృప్తి కలిగిస్తుంది.

మతం… ఆధ్యాత్మికత

నేను విద్యార్థి దశ నుంచి అనేక మత గ్రంధాలు చదివాను. అందులో అన్ని మతాలకు చెందినవి ఉన్నాయి. దేశ విదేశాలలో ఉన్న కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఆచారాలు, నమ్మకాలు, పూజాదికాలు వేరువేరైనా అన్ని మతాల సారం ఒక్కటేనని నాకు అర్థం అయింది. అన్నిచోట్ల నాకు అనుభవంలోకి వచ్చింది, కన్పించింది ఒక్కటే! మతం అంటే ఓ ఆత్మ జ్ఞానం, ఓ ప్రశాంత స్థితి. ఏ మతమైనా మనిషికి కొన్ని ధర్మాలను తెలుపుతుంది. అవి.. ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయాగుణం, సత్యం. సాటి మనుషుల మధ్య సామరస్యం పరస్పర సహకారం పెంపొందడానికి అవి మార్గాలను చూపుతాయి. అన్ని మత గ్రంధాలలో మహానుభావులు ప్రవచించిన ‘సత్యం’ ఇదే. ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించినపుడు నాకు గోచరించిన దైవత్వం పరిపూర్ణ మానవత్వమే.

ప్రతి మతం స్వచ్ఛమైనది, విశాలమైనది. మతాలు ఏర్పడిన కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ ప్రాంత స్థితిగతులు, పరిసరాల ప్రభావం నాకు కనిపించాయి. అయితే, మనిషిలో ఉండే మితిమీరిన కోరికలు, అర్థంలేని భయాలు ఆధిపత్య ధోరణిని ప్రేరేపించడం వల్లనే కొందరు మతస్వరూపాన్ని మార్చారు. మానవాళి దుఖాన్ని నివారించి వారికి ఆధ్యాత్మిక ఔషధంగా ఉపయోగపడే మతాలను కొందరు తమ స్వలాభానికి, స్వార్థానికి ఆధిపత్యం కోసం వాడుకుంటున్నారు. ఏ మతం పరమార్ధమైనా మానవ కళ్యాణమే. మతం.. ఎల్లప్పుడూ మనిషి పురోభివృద్ధికి దోహదం చేయాలే తప్ప అభివృద్ధికి ఆటంకంగా పరిణమించరాదు. మనస్సు నిశ్చలంగా, నిలకడగా ఉంచుకోగలిగి మనిషిగా ఎదిగి ఆలోచించగలిగితే అన్నీ అర్థం అవుతాయి.

రచనలు

సామాజిక గోడ

ట్విట్టర్